కడప: కడపలో ఏరియా ఆసుపత్రిని బస్టాండ్, చిత్తూరు జిల్లా పుంగనూరులో బస్ డిపో ను ఏపీ సీఎం జగన్ గురువారం నాడు  వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.కరోనా నేపథ్యంలో సీఎం జగన్ అమరావతి క్యాంప్ కార్యాలయం నుండి  ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. కడప బస్టాండ్ కు వైఎస్ఆర్ బస్టాండ్ గా నామకరణం చేశారు.  మధ్యాహ్నం 12 గంటలలోపుగా అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సీఎం మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. కర్ఫ్యూ టైమ్ ప్రారంభం కాకముందే ఇళ్లకు వెళ్లకపోతే  వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన నేతలు   మాస్కులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మాస్కుల్లో ఉన్నందున అందరినీ గుర్తు పట్టలేకపోతున్నట్టుగా జగన్ చెప్పారు. పుంగనూరు ప్రజల చిరకాలం వాంఛ తీరిందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బస్ డిపో ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, ఆల్లనాని తదితరులు పాల్గొన్నారు.