ఏపీకి త్వరలో విశాఖపట్టణం రాజధాని: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్టణం రాజధానిగా మారనుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ ఏడాది మార్చిలో విశాఖపట్టణంలో ఇన్వెస్టర్స్ మీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: ఏపీకి కాబోయే రాజధాని విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పారిశ్రామికవేత్తలను కోరారు. విశాఖపట్టణం త్వరలోనే ఏపీకి రాజధానిగా మారనుందని సీఎం జగన్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మంగళవారం నాడు న్యూఢిల్లీలో జరిగింది.ఈ సమ్మిట్ లో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలో తాను కూడా విశాఖపట్టణానికి షిఫ్ట్ అవుతానని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఏపీ సీెం వైఎస్ జగన్ చెప్పారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం అవసరమని సీఎం జగన్ కోరారు.
ఈ ఏడాది మార్చి మాసంలో విశాఖలో పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు.ఈ సమావేశానికి రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను జగన్ కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని జగన్ గుర్తు చేశారు. సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు అందిస్తున్న విషయాన్ని సీఎం జగన్ వివరించారు. 11. 43 శాతం వృద్ది రేటుతో దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఏపీలో మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లున్నాయన్నారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సీఎం వివరించారు.