కుప్పం కోటను బద్దలు కొట్టారు: పెద్దిరెడ్డిని అభినందించిన జగన్
కుప్పం కోటను బద్దలు కొట్టారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు.
అమరావతి: కుప్పం కోటను బద్దలు కొట్టారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై జగన్ మంత్రులతో చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ మాట్లాడారు.
కుప్పం నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ 14 సర్పంచ్ స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకొంది. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కుప్పం కోటను బద్దలు కొట్టారని ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉందని జగన్ మంత్రులకు చెప్పారు.
గ్రామపంచాయితీ ఎన్నికల్లో వచ్చిన తరహాలోనే అన్ని ఎన్నికల్లో ఫలితాలు రావాలని ఆయన మంత్రులకు చెప్పారు. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతామన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 80 శాతం ఫలితాలు సాధించినట్టుగా ఆయన చెప్పారు.
కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను వ్యాక్సిన్ ను త్వరగా ఇవ్వాలన్నారు. లేకపోతే కేసులు పెరిగే అవకాశం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని జగన్ మంత్రులకు సూచించారు.