రాత్రి నిశ్చితార్థ బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోపడి ఎనిమిదిమంది మృతిచెందగా 45మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు, గాయపడివారి వైద్యానికి ఆర్థిక సాాయం ప్రకటించారు.
అమరావతి: చిత్తూరు జిల్లాలో శుభకార్యానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సు లోయలో పడి ఎనిమిది అక్కడిక్కడే మృతిచెందగా మరో 54మంది గాయపడ్డారు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం గురించి తెలియడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే అధికారులకు ఈ ఘోర ప్రమాదంపై ఆరా తీసారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం అందిచనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
ఇక ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు... ప్రత్యేక బృందాలతో, ఫైర్ సిబ్బంది సహాయంతో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ సహాయక చర్యలను పర్యవేక్షించినట్లు అధికారులు సీఎం కు వివరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు సీఎంకు తెలుసుకున్నారు.
క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని... బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ప్రమాదం జరిగిందిలా...
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. ఇందుకోసం వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు మొత్తం 52మంది నిన్న(శనివారం) రాత్రి ఓ ప్రైవేట్ బస్సులో నిశ్చితార్థం జరిగే మండపానికి బయలుదేరారు.
బస్సు బాకరాపేట దాటుకుని ఘాట్ రోడ్డు;[ తిరుపతి వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. మితిమీరిన వేగంతో వెళుతూ ఓ మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. అయితే చిమ్మచీకటి, అందులోనూ 60అడుగుల లోతు లోయలో బస్సు పడిపోవడంతో చాలాసేపటి వరకు ప్రమాదంగురించి బయటపడలేదు. అయితే ఘాట్ రోడ్డుపై వెళుతున్న వాహనదారులో లోయలోంచి ఆర్థనాదాలు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చంద్రగిరి పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ నారాయణన్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ఫైర్ సిబ్బంది సహాయంతో లోయలోకి దిగి క్షతగాత్రులను కాపాడి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. దీంతో చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం మృతదేహాలను కూడా అతికష్టంతో లోయలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అనంతరం ఎస్పీ అప్పలనాయుడు హాస్పిటల్ కు చేరుకుని గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. అడిషనల్ ఎస్పీ సుప్రజా, జిల్లాకు చెందిన ఇతర డీఎస్పీలు, సిఐలు హాస్పిటల్ వద్ద పరిస్థితులను, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను పరిశీలించారు.
ఇప్పటివరకు నిశ్చితార్థ బృందంలోని ఏడుగురు మృతిచెందగా మరో 45 మందికి గాయాలపాలయ్యారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.
