ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఇద్దరు నేతలు గంట పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మరికాసేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం కానున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో (pm narendra modi) ఏపీ సీఎం వైఎస్ జగన్ (cm ys jagan) భేటీ ముగిసింది. జిల్లాల విభజన, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇద్దరి మధ్య సుమారు గంటకుపై పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి నిధులు, పెండింగ్ సమస్యలతో పాటు.. రాజకీయ పరిణామాల గురించి కూడా ప్రధానికి జగన్ వివరించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా మోడీకి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పోలవరం పూర్తి కావడానికి ఇంకా రూ.31,188 కోట్లు అవసరమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు కేంద్రం ఇస్తున్న బిల్లులకు వ్యత్యాసం వుందని.. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపిక విధానం వల్ల ఏపీకి నష్టం జరుగుతోందని సీఎం చెప్పారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లు అందించాలని జగన్ కోరారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని మోడీని కోరారు జగన్. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఇచ్చిన హామీ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మినరల్స్ ప్రాంతాలు కేటాయించాలని జగన్ కోరారు. రాష్ట్రం తలపెట్టిన 12 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.