ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కారం కానుంది. ఒకే రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్పలు  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్‌ అయ్యింది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనున్నారు. 23వ తేదీ సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకోనున్నారు.

24న ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

అయితే ఈ ఏడాది కోవిడ్ 19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తుల రద్దీ లేని కారణంగా పూర్వ సంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం వుంది. అనంతరం కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో జగన్, యడియూరప్ప పాల్గొంటారు. ఆ తర్వాత జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.