విజయవాడ: భారత రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందాలన్నదే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు సీఎం వైయస్ జగన్. రాజ్యాంగానికి ఆత్మగా అభివర్ణించే ప్రాథమిక హక్కులు ప్రతీ ఒక్కరూ పొందాలన్నదే తన తపన అని చెప్పుకొచ్చారు. 

73వ స్వాతంత్య్ర దినోత్సవం భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్ అనంతరం రాష్ట్రప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో కల్పించినా రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక అసమానతలు నేటికి కనిపిస్తూనే ఉన్నాయన్నారు. 

ఈ సందర్భంగా గతప్రభుత్వంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో టెండరింగ్ పనుల్లో అలసత్వం వల్ల రివర్స్ టెండరింగ్ కు వెళ్తే దానిపై రాష్ట్రంలో కొందరు గగ్గోలు పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని  చట్టం చేస్తే వాటి మీద కూడా నానా యాగీ చేస్తా ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఎన్ని ఆటంకాలు ఎదురైనా వ్యవస్థను మార్చుకుందామని ధృఢ నిశ్చయంతో గడచిన రెండు నెలల్లోనే ముందడుగు వేశామని తెలిపారు. భారతదేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో బడుగులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు పెద్దపీట వేస్తూ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 

శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎన్నడూ లేనట్టుగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన మెుట్టమెుదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్తున్నానని తెలిపారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కేస్ట్ కాదు భారతీయ సంస్కృతికి, భారతీయ నాగరికతకు వారు బ్యాక్ బోన్ గా  జగన్ అభివర్ణించారు. 

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కేస్ట్ కాదని దేశానికి వెన్నెముక అంటూ జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు మహిళలకు, దళితులకు, మైనారిటీలకు కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మెుట్టమెుదటి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమని జగన్ స్పష్టం చేశారు. 

మరోఅడుగు ముందుకు వేస్తూ ప్రభుత్వం నామినేటెడ్ పనుల్లోనూ, పదవుల్లోనూ గతంలో ఎన్నడూ జరగని విధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మెుట్టమెుదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు. పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలంటూ మెుట్టముదటి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 

ప్రజల ఆరోగ్యమా, ప్రభుత్వ ఆదాయమా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం, వారి కుటుంబాల్లో ఆనందం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యనియంత్రణలో భాగంగా రాష్ట్రంలో బెల్ట్ షాపులను శాశ్వతంగా రద్దు చేసినట్లు తెలిపారు. 

అక్టోబర్ ఒకటి నుంచి మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భూ హక్కుదారులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా 15 లక్షల మంది కౌలు రైతులకు వైయస్ఆర్ భరోసా ఉచితంగా పంటల భీమా, పంటల పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పరాయిపాలన పోయినా దాని అవలక్షణాలను వదిలించుకోలేకపోతున్నాం : సీఎం జగన్

ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

ఇండిపెండెన్స్ డే: సీఎంగా తొలిసారి జగన్