అమరావతి: రైతు సంక్షేమమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు విత్తనాల దగ్గర నుంచి పంట చేతికంది వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పించే వంటి అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు. 

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పండించిన పంటలకు ధరలు పెంచే అంశంపై వారికి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 

మరోవైపు గత ప్రభుత్వం పెండింగ్ లోపెట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు. విత్తన బకాయిలు కింద రూ.384 కోట్లను తమ ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. 

అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి పెండింగ్ లో ఉంచిన రూ.960కోట్లను కూడా రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఆ బకాయిలలో తొలివిడతగా రూ.360కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2018-19 ఏడాదికి గానూ విడుదల చేయని ఇన్ పుట్ సబ్సిడీ అక్షరాలా రూ.2000 కోట్లు విడుదల చేశామని జగన్ స్పష్టం చేశారు.  

అలాగే రైతాంగానికి మరింత లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ మిషన్ ను సైతం నియమించినట్లు చెప్పుకొచ్చారు. ప్రతీ నెల ఈ వ్యవసాయ మిషన్ సమావేశమై వ్యవసాయ రంగానికి తోడ్పాటు నందిస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి దశదిశ నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించేలా ఈ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ మిషన్లో ప్రముఖ రైతులు, శాస్త్రవేత్తలను నియమించినట్లు తెలిపారు. 

మరోవైపు రైతుల ఆత్మహత్యలు, మరణాలపై కూడా తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదవశాత్తు మరణించినా వారిని ఆదుకునేందుకు రూ.7లక్షలు నష్టపరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. 

డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరోల ప్రకారం 2014-19 సంవత్సరాల్లో 1513 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. అయితే వారిలో కేవలం  303 మందికే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మిగిలిన వారికి కూడా ఈ ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని అందించబోతుందని జగన్ హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్