విజయవాడ: విజయవాడ నగరంలో నిరుపేద కుటుంబాలను అండగా నిలుస్తూ సీఎం జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. రైల్వేశాఖకు ఉపయోగం లేని భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేంద్ర మంత్రిని కోరారు జగన్. విజయవాడ కార్పొరేషన్ ఎన్పికల సందర్భంగా సీఎం లేఖకు ప్రాధాన్యతను సంతరించుకుంది.  

నగరంలోని రాజరాజేశ్వరి పేటలోని  రైల్వే స్థలంలో 800 నిరుపేద కుటుంబాలు నివాసముంటున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం. 30ఏళ్లుగా ఆ కుటుంబాలు అక్కడే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నాయని అన్నారు. ఈ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని గత ప్రభుత్వాలకు వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు.  కనీసం ఆ సమస్యను రైల్వే శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదన్నారు సీఎం.  

రాజరాజేశ్వరి పేటలో నిరుపేద కుటుంబాలు నివాసముంటున్న  భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని... దానికి బదులుగా అజీత్ సింగ్ నగర్లో 25 ఎకరాలు రైల్వేశాఖకు బదిలీ చేయనున్నట్లు సీఎం జగన్ కేంద్ర మంత్రికి సూచించారు. కాబట్టి సంబంధిత రైల్వే బోర్డు అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే మంత్రిని కోరారు ముఖ్యమంత్రి జగన్.