అమరావతి: లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్షిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దిశ తరహలోనే అవినీతి కేసుల విషయంలో కూడ ఉద్యోగులకు కఠిన శిక్షలు పడేలా చట్టం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అవినీతి నిరోధక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడ అనుసంధానించనున్నారు.

ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.గుడ్‌ గవర్నెన్స్‌పై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఐఐఎం  అహ్మదాబాద్‌ ప్రతినిధులు ఇవాళ సీఎం జగన్ కు నివేదికను సమర్పించారు. 

గత ఏడాది నవంబరులో 14400 కాల్‌ సెంటర్‌ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 44,999 కాల్స్‌ వచ్చాయని ఏసీబీ అధికారులు సీఎంకు నివేదించారు. 
 ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1747 ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు  1712 అంశాలు పరిష్కరించినట్టుగా ఏసీబీ తెలిపింది.

161 కాల్స్‌ విషయంలో చర్యలు తీసుకుంటున్నామన్న ఏసీబీ తెలిపింది. 35 కాల్స్‌ పెండింగులో ఉన్నాయని ఏసీబీ వివరించింది.1902 నెంబర్‌ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని ఆయన కోరారు.

రెడ్‌ హ్యండెడ్‌గా దొరికిన కేసుల్లో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టవద్దని కూడ సీఎం అధికారులను ఆదేశించారు.అవినీతికి పాల్పడుతూ  రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలని సీఎం సూచించారు.

also read:రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్: జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే.. అవినీతి నిరోధకత విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని సీఎం ఆదేశించారు.

పై స్థాయిలో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించినట్టుగా సీఎం చెప్పారు.  మిగిలిన స్థాయిల్లో ఉన్న యాభై శాతం అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్