అమరావతి: రివర్స్ టెండరింగ్ లో ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి విభాగంలో కూడ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని పలు విభాగాల్లో  పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకొందని అప్పట్లో వైసీపీ విమర్శలు చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు చర్యలను ప్రారంభించారు.  ఈ క్రమంలోనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా జగన్ ప్రకటించారు.

నీటి పారుదల ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడ అమలు చేయనున్నారు.  కోటి రూపాయాలు దాటిన ప్రతి టెండర్ రివర్స్ టెండరింగ్ కు పంపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా సుమారు 15.01 శాతం మిగిలే అవకాశం ఉందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.సాధారణ టెండర్ ద్వారా 7.7 శాతం మాత్రమే ప్రయోజనం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

 కోటి దాటిన ప్రతి టెండర్ ను రివర్స్ టెండరింగ్ కు ఇక నుండి పంపనున్నారు. మరో వైపు రూ. 100 కోట్లు దాటిన ప్రాజెక్టులకు జ్యూడీషీయల్ ప్రివ్యూకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

గత ఏడాది ఆగష్టు నుండి ఇప్పటివరకు 45 ప్రాజెక్టులకు సంబంధించి జ్యూడీషీయల్ ప్రివ్యూకు పంపనున్నారు. వీటి విలువ సుమారు రూ. 14 వేల 285 కోట్లు ఉంటుందని అంచనా.గత ఏడాది నుండి ఇప్పటివరకు  788 ప్రాజెక్టులకు రివర్స్ టెండర్లు నిర్వహించారు.

అవినీతికి దూరంగా తమ పాలన ఉంటుందని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి  తీసుకొచ్చారు. కర్నూల్ జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయాల్లో కూడ రివర్స్ టెండరింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.