ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో 8వేల మందికి ఉపాధి: విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్
పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ మంగళవారంనాడు విశాఖపట్టణానికి వచ్చారు. విశాఖను రాజధానిగా సీఎం జగన్ ప్రకటించారు. ఈ దిశగా పలు సంస్థలు, కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
విశాఖపట్టణం: నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ మంగళవారంనాడు విశాఖ పట్టణానికి చేరుకున్నారు. నగరంలోని కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో ఈ మాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 15 ఎకరాల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది రహేజా సంస్థ.మరో వైపు రూ. 136 కోట్లతో జీవీఎంసీలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడ సీఎం ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టుల్లో ఇది ఒకటన్నారు.విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందన్నారు. ఈ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉపాధి లభ్యం కానుందని సీఎం జగన్ చెప్పారు.రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఫైవ్ స్టార్ హోటల్ కూడ నిర్మించేందుకు రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉందని సీఎం జగన్ చెప్పారు. రహేజా గ్రూప్‌నకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్టును ఇవ్వనున్నట్టుగా సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి సహాయ సహకారాల కోసం ఎప్పుడైనా తనను నేరుగా సంప్రదించవచ్చని సీఎం జగన్ చెప్పారు. ఏ విషయమైనా తనకు ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందన్నారు.