గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ఏపీ సీఎం జగన్ దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ మరో రాష్ట్రానికి బదిలీ అయిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ఏపీ సీఎం వైఎస్ జగన్, భారతీరెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పని చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గడ్‌కు బదిలీ అయ్యారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సతీమణి.. బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను కలిసి మాట్లాడారు.
బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ప్రజలు గవర్నర్‌గా బిశ్వబూషణ్ హరిచందన్ అందించిన సేవలను మరిచిపోరని అన్నారు. మచ్చలేని వ్యక్తిత్వం, కరోనా ఆపత్కాలాన్ని అధిగమించడంలో సహకరించి రాష్ట్ర ప్రగతికి దోహదపడటానికి దోహదపడ్డారని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా, హుందాగా వ్యవహరించారని, ఉన్నత రాజకీయ పరిణతితో రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు.
Also Read: ఇతరుల ఇళ్లలో ఆడవాళ్లకు ఆత్మాభిమానం ఉండదా?.. చంద్రబాబుది నీచ సంస్కృతి: పేర్ని నాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించి, సఖ్యతతో అభివృద్ధిలో పాలుపంచుకోవడంలో కీలక భూమిక పోషించారని వివరించారు. ఆయన రాజ్యాంగ పదవికే వన్నె తెచ్చారని గవర్నర్ పై ప్రశంసలు కురిపించారు. అలాంటి గవర్నర్ రాష్ట్ర నుంచి వెళ్లవలసి రావటం బాధాకరమైనప్పటికీ మరో చోట అదే పదవిపై వెళ్లి అక్కడి ప్రజలకు మేలు చేస్తారనే బలమైన విశ్వాసం తమకు ఉన్నదని తెలిపారు.
