అమరావతి: టీఆర్ ఎస్ పార్టీతో పొత్తు, తెలంగాణలో ప్రజాకూటమితో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిందో అన్న అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు టీఆర్ఎస్‌తో పొత్తు కోసం తాను వెంపర్లాడానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తన గురించి తప్పుడుగా ప్రచారం చెయ్యడం తగదంటూ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు రెండూ సఖ్యంగా ఉండాలని తాను అభిలాషించానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని విమర్శించారు. 

ప్రత్యేక హోదాకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం చెప్పనంత వరకు తానేమీ మాట్లాడటం సరికదా కనీసం టీఆర్ఎస్ ను ఒక్కమాట కూడా అనలేదన్నారు. అయితే ప్రత్యేక హోదాకు అడ్డం తిరగడం వల్లనే వ్యతిరేకించాల్సి వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.