ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. మోదీ ఏపీకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను నరేంద్రమోదీ తప్పారని విరుచుకుపడ్డారు. 

అంతేకాదు విశాఖపట్నం, అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు సభలో ఎలాంటి అబంఢాలు వేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

రాజధాని అమరావతి శంఖుస్థాపనకు వచ్చి మట్టి, యమునా నది నీరు తెచ్చి మా మెుఖాన కొట్టారని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు మాట తప్పారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక బాధ్యత యుతమైన పదవిలో ఉన్న మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. 

తాము బీజేపీని వీడలేదని వీడేలా చేశారని విరుచుకుపడ్డారు. మిత్ర ధర్మానికి నీళ్లొదిలింది బీజేపీ అని ఘాటుగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెుండి చెయ్యిచూపించిన ప్రధాని అసత్యాలు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. 

గుంటూరు సభలో ప్రధాని నరేంద్రమోదీ అసత్యాలు పలికారని అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపించారు. తాను మోదీ గురించి మాట్లాడితే మెుఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. 

మోదీ దేశానికి లక్షల కోట్లు ఇచ్చామని ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఏమీ ఇచ్చారో చెప్పాలని ఆధారాలు ఉన్నాయా అంటూ నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులు కంటే తమ రాష్ట్రం నుంచి తీసుకున్న పన్నులే ఎక్కువ అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 

ఏపీకి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిన కూడా ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. ఆఖరికి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టకు సుమారు రూ.4వేల కోట్లు రావాల్సి ఉందని అలాగే పునర్విభజన చట్టంలోని 16 అంశాలను అమలు చెయ్యడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

తమ హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తుంటే తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈడీ, ఇన్ కమ్ టాక్స్ లను వదులుతున్నారని విరుచుకుపడ్డారు. తాజాగా అమిత్ షా ఏపీ ప్రజలకు లేఖలు రాస్తున్నారని అమిత్ షా లేఖలను ప్రజలు నమ్మరన్నారు. 

గతంలో లేఖలు రాసినా ఎవరూ పట్టించు కోలేదన్నారు. ఏపీలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అమిత్ షా పర్యటనలో ఏలాంటి పరాభవం ఎదురైందో అదే ఇకపై ఎదురవుతుందన్నారు. ఇప్పటికైనా మోదీ, అమిత్ షాల వైఖరిలో మార్పురావాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

ప్రశ్చాత్తాపం ఉండాలని కోరారు. మోదీ, అమిత్ షాలు భయంకరమైన వ్యక్తులు అని వారు భయపెడితే భయపడబోమని తిరగడతామన్నారు. మీ కాంబినేషన్ ను తాను వదిలేది లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 

అంతిమ విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటానని తెలిపారు. పోరాటంలో మోదీ, అమిత్ షాలు అలసిపోవచ్చునేమో కానీ తాను మాత్రం అలసిపోనని ఫైట్ చేసి తీరుతానని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అవకాశం ఉందని ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దేశమంతా మనవైపే ఉంది, నైతిక విజయం మనదే: చంద్రబాబు

హోదాపై రాజీలేని పోరాటం చేస్తా, అధైర్యపడొద్దు: చంద్రబాబు పిలుపు