ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక దివ్యాంగుడు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు హాజరైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగుడు అర్జున్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి చలించిపోయానని చంద్రబాబు నాయుడు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఏకమయ్యాయని ప్రత్యేక హోదా సాధించి తీరుతామని తెలిపారు. 

అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడొద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. అర్జునరావు కుటుంబానికి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అర్జునరావు గతంలో ఓ ప్రమాదంలో వికలాంగుడు అయ్యారని, ప్రస్తుతం వికలాంగ పింఛన్ తీసుకుంటున్నాడని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఆయన వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చారని తెలిపారు. ఇదే ఆఖరి ఆత్మహత్య కావాలని ఎవరూ ఇలా ఆందోళన చెందొద్దని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.