ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు అమలు కోరుతూ ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చరిత్రలో ఈ రోజు గుర్తుండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపిన ప్రతీ నేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాకతో మొదలై దీక్ష మాజీ ప్రధాని దేవెగౌడతో ముగియడం చరిత్ర అంటూ అభివర్ణించారు. 

మోదీ ప్రజలు తిరస్కరించిన మనిషి అయితే ప్రజల ప్రధాని దేవెగౌడ అంటూ అభివర్ణించారు. దీక్ష ముగింపుకు దేవెగౌడ హాజరుకావడం శుభపరిణామమన్నారు. తాను చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించిన వారిందరికీ 5 కోట్ల ఆంధ్రుల తరుపున కృతజ్ఞతలు చెప్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఈ దీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు అంతా ఒక్కటేనని ప్రపంచానికి తెలిసిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అటు జాతీయ స్థాయిలోని అనేక పార్టీలు కేవలం మోదీ అండ్ కో మినహాయిస్తే అన్ని పార్టీలు హాజరై సంఘీభావం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

తమ దీక్షకు నేతలు చూపిన చొరవతో మరింత ముందుకు వెళ్తామని తెలిపారు. ఇంతమంది నేతలు మద్దతు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక వచ్చి తీరుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు.  

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుదిక్కుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దేశం అంతా మనకు మద్దతు పలికిందని దేశం మనవెంటే ఉందన్నారు. ఈసారి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ హోదా ప్రకటించకపోయినా, నైతిక విజయం సాధించామని చంద్రబాబు నాయుడు తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

హోదాపై రాజీలేని పోరాటం చేస్తా, అధైర్యపడొద్దు: చంద్రబాబు పిలుపు