ఈ ఏడాది అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీరు-ప్రగతి పురోగతిపై సీఎం ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018లో అద్భుతంగా పనిచేశామని, అన్ని శాఖల్లో పురోగతి సాధించామని ప్రతి ఒక్కరికి సదుపాయాలు కల్పించడంతో పాటు ఇబ్బందులు తొలగించామన్నారు.

2018లో చేసిన కృషి ఫలితాలు 2019లో వస్తాయని, తొలి 6 నెలల్లోనే 11.5 శాతం వృద్ధి సాధించామని, ఈ ఏడాది వివిధ రంగాల్లో 675 పైగా అవార్డులు సాధించామని చంద్రబాబు తెలిపారు. కృషి కల్యాణ్ యోజనలో విజయనగరం, విశాఖ, కడప జిల్లాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయన్నారు.

ముందుచూపు, సరికొత్త ఆవిష్కరణలు, జవాబుదారీతనంలో డిజిటలైజేషన్, పారదర్శకతతోనే ఇన్ని అవార్డులు సాధించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాను టీమ్ లీడర్‌నని.. ఈ క్రెడిట్ తన టీమ్‌కే చెందుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ తిరుగులేని శక్తిగా రూపొందాలని, ప్రపంచం ఏపీ వైపే చూడాలని తెలిపారు. 5 వేల మంది కౌలు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించానమన్నారు.

రాష్ట్రంలో కౌలు రైతులకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా చేశామని, పంట భీమా రాష్ట్ర వాటా వెంటనే విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే కేంద్రం వాటా విడుదల చేసేలా ఒత్తిడి తేవాలని సీఎం అన్నారు.