అమరావతి: ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చఏశారు. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

చంద్రన్నబాట కింద రాష్ట్రంలో 25 వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేశామని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ క్యాంటిన్ల ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. కిడ్నీ బాధితుల పెన్షన్ల రూ.2,500 నుంచి రూ.3,500కు పెంచామని, డయాలసిస్‌ కేంద్రాలను పెంచామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, కాపులకు తాను ఇచ్చిన హామీలను తూచ తప్పుకుండా అమలు చేసినట్లు తెలిపారు. కాపుకొర్పొరేషన్ ను ఏర్పాటు చెయ్యడంతోపాటు 5 శాతం రిజర్వేషన్ల ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తోపాటు బీసీ, ఇతర కులాలకు  కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా మాటలతో మభ్యపెట్టే నాయకులు కాలగర్భంలో కలిసిపోతారని చేతల్లో చూపెట్టే నేతలు చరిత్రలో నిలిచిపోతారంటూ చెప్పుకొచ్చారు. 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించినట్లు తెలిపారు. 

తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 రూపొందిస్తే తనను హేళన చేశారని అది ఇప్పుడు అమలు చేస్తుంటే అద్భతమంటున్నారని తెలిపారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలన్నదే తన విజన్ అని చెప్పుకొచ్చారు. 2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.