Asianet News TeluguAsianet News Telugu

పార్టీ శాశ్వతం, 5ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి: కార్యకర్తలకు చంద్రబాబు హితోపదేశం

పార్టీ శాశ్వతం, ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి వస్తాయి. ప్రస్తుతం ఫలితాలు విడుదలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయని ఆ ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో పోటి చేయడం ఒక్కటే ముఖ్యం కాదన్న చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాలను అధ్యయనం చేయాలని సూచించారు. 

ap cm chandrababu naidu sensational comments
Author
Amaravathi, First Published May 13, 2019, 6:02 PM IST

అమరావతి: మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాను 4 రకాల సర్వేలు చేయించామని ఆ సర్వేలలో టీడీపీ గెలుపు ఖాయమని తేలిందన్నారు. టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని హితవు పలికారు. 

పార్టీ శాశ్వతం, ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి వస్తాయి. ప్రస్తుతం ఫలితాలు విడుదలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయని ఆ ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. 

ఎన్నికల్లో పోటి చేయడం ఒక్కటే ముఖ్యం కాదన్న చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాలను అధ్యయనం చేయాలని సూచించారు. మనం చేసిన కార్యక్రమాలే  మనకు శ్రీరామ రక్ష అన్న చంద్రబాబు ప్రకృతి తెలుగుదేశం పార్టీకి బాగా  కలిసివచ్చిందని చెప్పుకొచ్చారు. 

లబ్దిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశామని అదే గెలిపిస్తుందన్నారు. అమరావతిలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ సమీక్షలో పాల్గొన్న చంద్రబాబు కర్నూలు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 6 పార్లమెంట్ స్థానాల్లో సమీక్షలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. 

రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల చొప్పున సమీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇకపోతే జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు మే నెలలో రావాల్సి ఉందని అయితే తొలిదశలో ఎన్నికలు నిర్వహించి ఇబ్బంది పెట్టాలని చూశారని కానీ అదే మంచిదైందన్నారు. 

చెడు చేయాలని భావించినా టిడిపికి మంచే జరిగిందన్నారు. ప్రతి నెలా తొలివారంలో లబ్దిదారులకు పించన్లు, ఆర్ధిక సాయం ప్లస్ అవుతాయని రెండవ వారంలో ఎన్నిక రావడం మంచి జరిగిందన్నారు.  మంచికి మారుపేరు టీడీపీ అయితే దుర్మార్గులకు మారు పేరు వైసీపీ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఓడిపోతామని తెలిసి కూడా వైసిపి బుకాయిస్తోందన్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాగే డ్రామా ఆడారని మే 23న టిడిపి గెలుపు లాంఛనం కాబోతుందన్నారు. ఇకపోతే నరేంద్రమోదీ ప్రధాని అయ్యే చాన్స్ లేదన్నారు. దేశంలో బిజెపి ఓటమి ఖాయం అయ్యిందన్న ఆయన ఏపికి జరిగిన అన్యాయంపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. 


బీజేపీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేశామని తెలిపారు. ప్రధానిగా తాను ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని స్థితిలో మోదీ ఉన్నారని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి చెప్పడం మానేసి 28ఏళ్ల క్రితం చనిపోయిన మాజీ ప్రధాని రాజీవ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 


సైన్యం త్యాగాల ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ మాటల్లో ఓటమి నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు.నంద్యాల, కర్నూలు రెండు లోక్ సభ సీట్లలోనూ టిడిపి ఘనవిజయం సాధిస్తోందని చంద్రబాబు జోస్యం చెప్పారు. సంస్థాగత బలమే ఈ ఎన్నికల్లో టిడిపికి కలిసొచ్చిందన్నారు. 

65లక్షల మంది కార్యకర్తలు, 4లక్షల మంది సేవామిత్రలు, 45వేల మంది బూత్ కన్వీనర్లు, 5వేల మంది ఏరియా కన్వీనర్లు ఉన్నారని వారంతా తామే అభ్యర్థులుగా భావించి కష్టపడ్డారని తెలిపారు.  తాను నిర్వహించిన సర్వేలలో టీడీపీకే ఆధిక్యత వచ్చిందని చెప్పుకొచ్చారు. 

40ఏళ్లలో జరగని సంక్షేమం, అభివృద్ధి ఈ 5ఏళ్లలో చేశామన్నారు. మహిళల అభివృద్ధి  కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 

పెట్టుబడిసాయం కింద మరో రూ.14వేల కోట్లు ఇచ్చామన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో దేశాన్ని విభజించిన చరిత్ర మోదిదంటూ విరుచుకుపడ్డారు. విద్వేష భావాలు పెంచడమే నరేంద్రమోదీ రాజకీయమన్నారు. విభజించి పాలించడమే బిజెపి వ్యూహమని చెప్పుకొచ్చారు. 

అత్యంత విఫల ప్రధానిగా నరేంద్రమోదీ మిగిలారని మోడి వైఫల్యాలను టైమ్ మ్యాగజైన్ కథనం ఎత్తిచూపిందని విమర్శించారు. డబ్బు, కులం, మతంతో రాజకీయం నిలబడేది కాదు ఏదో ఒక ఎన్నికకు మాత్రమేనన్నారు. పదేపదే ప్రతి ఎన్నికలో వీటినే ప్రయోగిస్తే ప్రజలు నమ్మరన్నారు. భవిష్యత్తులో వీటన్నింటిని ఎలా అధిగమించాలో దృష్టి పెట్టాలి. తనకు కులం, మతం అనేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios