ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు  నాయుడు. గురువారం ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయిన బాబు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో దేశం చూసిన విఫల ప్రధాని మోడీయేనన్నారు.

ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టని ప్రధాని మోడీ తప్ప మరెవరూ లేరని మండిపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటకొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీడియాతో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.

సాక్షాత్తూ రక్షణ శాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు ఎప్పుడైనా మాయమయ్యాయా అని సీఎం ప్రశ్నించారు. మోడీ పాలనలో బ్యాకింగ్ వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని మండిపడ్డారు.

ఏటీఎంలను దిష్టిబొమ్మలుగా మార్చారని, నోట్ల రద్దును పెద్ద కుంభకోణంగా మార్చారని ధ్వజమెత్తారు. జీఎస్టీని సక్రమంగా అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారన్నారు. మోడీ పాలనలో రూపాయి విలువ దారుణంగా పతనమైందని, దేశంలో ఎప్పుడూ లేనంతగా అంత:కలహాలు రేగాయని చంద్రబాబు ఆరోపించారు.