అమరావతి‌: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీని గందరగోళపరిచేలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కంగారు పడొద్దని మంత్రులకు చంద్రబాబు సూచించారు. టీడీపీ గెలుపుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవదన్నారు. 

అమరావతిలో మంత్రులతో సమావేశమైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, ఎగ్జిట్‌ పోల్స్‌పై చంద్రబాబు నాయుడు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీపై వస్తోన్న సెటైర్లపై చర్చించారు. 

మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లు చూస్తుంటే మళ్లీ ఎన్డీయే వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. మోదీ విధానాలను జాతీయ స్థాయిలో పూర్తిగా ఎండగట్టలేకపోయారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అవకాశాలు కన్పించడం లేదన్నారు. ఒకవేళ ఎన్డీఏ వచ్చినా మోదీని ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ వార్తలు వస్తున్నాయంటూ ఒక మంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. మోదీని తప్పించి రాజ్ నాథ్ సింగ్ లేదా నితిన్ గడ్కరీలకు అవకాశం ఇస్తారంటూ మరో మంత్రి చెప్పుకొచ్చారు.