అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ను సామంతరాజును చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో సోమవారం ఉదయం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ కు ఏపీ అంటే ద్వేషమని కానీ జగన్ అంటే వల్లమాలిన ప్రేమం అంటూ చెప్పుకొచ్చారు. ఏపీని కేసీఆర్ తోలుబొమ్మను చేసి ఆడుకోవాలని భావిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదన్న కేసీఆర్ తో జగన్ దోస్తీ కట్టారంటూ ధ్వజమెత్తారు. 

ఏపీని కేసీఆర్ కు అప్పగించాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో అందర్నీ కలపాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కుల రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. 

విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులను కలిపిన ఘనత తమదేనన్నారు. ఆ రాజకుటుంబాలు కలివడంతో కాంగ్రెస్ కీలక నేత కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరారని తెలిపారు. అలాగే కడప జిల్లాలో ప్రత్యర్థులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వంటి కుటుంబాలన కలిపామని తెలిపారు. 

ఏపీలో వైసీపీ చిచ్చుపెట్టి కుల రాజకీయాలు చెయ్యాలని చూస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో బీహార్ మించి ఏపీలో కుల రాజకీయాలు చెయ్యాలని చూస్తున్నారని తెలిపారు. ఏపీలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పెద్ద నటుడు అంటూ విమర్శించారు. తన స్వార్థం కోసం మోదీ ఎంతకైనా తెగిస్తాడన్నారు. అవసరం లేదనుకుంటే వ్యవస్థలను అడ్డంపెట్టుకుని దాడులు చేయిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యం: చంద్రబాబు