నేరస్థుడైన జగన్‌ను అన్నగా మహిళలు అంగీకరించరన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...అన్నగా ఎలా ఉండాలో తెలియదు.. నేరస్థుడిగా ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ఎన్ని ప్రకటనలు చేసినా ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫించన్లపై జగన్ ప్రకటను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్‌కు దిక్కు తోచడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వం రూ.2 వేలిస్తే...తాము రూ.3 వేలిస్తామని జగన్ ప్రకటించారని, ఆయనకు ఓ సిద్ధాంతం లేదని మండిపడ్డారు. త్వరలో మున్సిపల్ స్టేడియంలో బూత్ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో సభ నిర్వహిస్తామని టీడీపీ అధినేత తెలిపారు.