టీడీపీ నేత చింతకాయల అయన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 

అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్లో టిడిపి నేత చింతకాయల విజయ్ కు సిఐడి మరోసారి నోటీసులు ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో మార్చి 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిఐడి పేర్కొంది. నర్సీపట్నంలోని ఆయన నివాసానికి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు వెళ్లారు. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో అందుబాటులో లేరు. దీంతో సిఐడి అధికారులు ఆ నోటీసులను విజయ తండ్రి టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఇచ్చారు. కాగా ఈ నోటీసుల మీద టిడిపి నేతలు మండిపడుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు చింతకాయల విజయ్ కి జనవరి 20 తారీకున కూడా ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులను 41ఏ సిఆర్ పిసి సెక్షన్ కింద జారీ చేశారు. భారతి పే కేసులో జనవరి 27న విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల్లో సిఐడి అధికారులు విజయ్ పాత్రుడికి తెలిపారు. కాగా, నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన సమయంలో విజయ పాత్రుడు ఇంట్లో లేకపోవడంతో.. ఆయన తల్లికి సీఐడీ అధికారులు నోటీసులు అందించారు.

సీఐడీ కార్యాలయానికి చేరుకున్న చింతకాలయ విజయ్.. కోర్టు అనుమతితో విచారణకు వచ్చానని కామెంట్..

సోషల్ మీడియాలో భారతి పే పేరుతో చేసిన పోస్టింగ్ ల విషయంలోనే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో కూడా చింతకాయల విజయ్ కి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సిఐడి విజయ పట్ల వ్యవహరించిన తీరును టిడిపి తప్పు పట్టింది. చింతకాయల విజయ్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పోస్టింగ్ ల వెనక ఐటిడిపి ఉందని, ఈ ఐటిడిపి వ్యవహారాలు విజయ పాత్రుడు చూస్తున్నారని సిఐడి నిరుడు డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించింది. 

నిరుడు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ పాత్రుడి మీద ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని విషయంలో కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్టు చేసిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ క్రమంలోనే అయ్యన్నపాత్రుడు హైకోర్టును కూడా ఆశ్రయించారు.