టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జ్ చింతకాయల విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జ్ చింతకాయల విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. భారతీ పే అంటూ దుష్ప్రచారం చేశారని అభియోగాలపై చింతకాయల విజయ్‌పై గతేడాది సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే వాటిపై స్టే తెచ్చుకన్న చింతకాయల విజయ్.. ఈ నెల 27న విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆ రోజున విచారణకు హాజరు కాలేనని మరోసారి ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు.
విజయ్ సీఐడీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన వెంట అయ్యన్నపాత్రుడుతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే టీడీపీ నేతలను సీఐడీ ఆఫీసుకు దూరంగా పోలీసులు నిలిపివేశారు. విచారణకు హాజరయ్యే సమయంలో విజయ్ తన లాయర్‌ను కూడా వెంట తీసుకొచ్చుకున్నారు.
సీఐడీ విచారణకు హాజరయ్యే క్రమంలోనే విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్న పిల్లలను కూడా సీఐడీ అధికారులు బెదిరించారనిఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. తనను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పిందని అన్నారు. సీఐడీ విచారణకు సహకరించాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చానని తెలిపారు. బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య గట్టిందని ఆరోపించారు. సెంటు భూమి కోసం తమ ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారని.. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు.
