Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నేత చింతకాయల విజయ్‌కి నోటీసులు.. కారణమిదే : ఏపీ సీఐడీ వివరణ

టీడీపీ యువనేత చింతకాయల విజయ్‌కి నోటీసులు ఇవ్వడంపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై తప్పుడు ప్రచారం చేసినందుకే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.ఐటీడీపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నడుస్తోందని సీఐడీ వెల్లడించింది. 

ap cid gave clarity on notice issue to tdp leader chintakayala vijay
Author
First Published Oct 1, 2022, 6:46 PM IST

టీడీపీ యువనేత చింతకాయల విజయ్‌కి నోటీసులు ఇవ్వడంపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై తప్పుడు ప్రచారం చేసినందుకే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. భారతి పే అని తప్పుడు వార్తలు సృష్టించారని , దీనంతటికీ ఐటీడీపీ పాత్ర వున్నట్లు తేలిందని ఏపీ సీఐడీ వెల్లడించింది. ఐటీడీపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నడుస్తోందని.. అందుకే నోటీసులు ఇచ్చామని సీఐడీ తెలిపింది. 

కాగా.. హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంటికి శనివారం ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో.. అక్కడున్నవారికి పోలీసులు నోటీసులు అందజేశారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌లు తీసుకురావాలని చెప్పారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు.. దౌర్జన్యానికి పాల్పడ్డారని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. అయితే సీఐడీ పోలీసులు ఎందుకు వచ్చారో.. అసలు కేసు ఏమిటో చెప్పలేదని విజయ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

ALso REad:విజయ్ ఇంట్లోని చిన్న పిల్లలను భయభ్రాంతులను చేసేలా వ్యవహరించడం దారుణం: సీఐడీ పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్

అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఐడీ పోలీసుల తీరును ఖండించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని న్నారు. 5 ఏళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని విమర్శించారు. 

సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే.. డ్రైవర్ పై దాడి చెయ్యడం ఎందుకు అని ప్రశ్నించారు. కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం.. బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్దతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios