Asianet News TeluguAsianet News Telugu

విజయ్ ఇంట్లోని చిన్న పిల్లలను భయభ్రాంతులను చేసేలా వ్యవహరించడం దారుణం: సీఐడీ పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్

హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంటికి శనివారం ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో.. అక్కడున్నవారికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

TDP Chief Chandrababu Naidu reacts on AP CID Notices to Chintakayala vijay
Author
First Published Oct 1, 2022, 5:02 PM IST

హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంటికి శనివారం ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో.. అక్కడున్నవారికి పోలీసులు నోటీసులు అందజేశారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌లు తీసుకురావాలని చెప్పారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు.. దౌర్జన్యానికి పాల్పడ్డారని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. అయితే సీఐడీ పోలీసులు ఎందుకు వచ్చారో.. అసలు కేసు ఏమిటో చెప్పలేదని విజయ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఐడీ పోలీసుల తీరును ఖండించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని న్నారు. 5 ఏళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని విమర్శించారు. 

సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే.. డ్రైవర్ పై దాడి చెయ్యడం ఎందుకు అని ప్రశ్నించారు. కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం.. బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేదని ఎద్దేవా చేశారు. 

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్దతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. 

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘‘కోర్టు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్ కి బుద్ది రావడం లేదు. పోలీస్ వ్యవస్థ ని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకున్నారు. బిసి నేత అయ్యన్న పాత్రుడి గారి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ట్రెండ్ సెట్ అపార్ట్మెంట్ లో చింతకాయల విజయ్ ఇంటికి ఎటువంటి నోటీసులు లేకుండా వెళ్లిన ఏపి పోలీసులు అక్రమ అరెస్ట్ కి ప్రయత్నించడం దారుణం. 

ఎందుకు వచ్చారో చెప్పకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులు, ఇంట్లో పని చేసే వారిపై బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేరాలు - ఘోరాలు చేస్తున్న వైసీపీ నేతలకు సన్మానాలు చేసి పదవులు కట్ట బెడుతుంది ప్రభుత్వం. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న టీడీపీ నేతల పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి. అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం. వైసీపీ అధికార మదాన్ని అణిచివేస్తాం’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios