రామతీర్ధం ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కోదండరామస్వామి విగ్రహాన్ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రామతీర్ధంలో రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని సునీల్ తెలిపారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే పకడ్బందీగా ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘటనా స్థలంలో హెక్సా బ్లేడ్ లభ్యమైందని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం, వివాదాలు సృష్టించడమే ఉద్దేశ్యంగా కనిపిస్తోందని సునీల్ అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని.. దోషులను వెంటనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:ఏపీలో ఆలయాలపై దాడులు: చినజీయర్ ఆగ్రహం.. విచారణకు డిమాండ్
 
కాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి కారణమైన రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం దేవాదాయ, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.