Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ స్కెచ్: గుట్టు విప్పిన చంద్రబాబు

వైసీపీ రాజీనామాల గుట్టువిప్పిన బాబు

Ap chief minister Chandrababunaidu   slams on Ysrcp

కర్నూల్: వైసీపీకి ఉప ఎన్నికలు వస్తాయనే భయంతో  తమ
రాజీనామాలను ఆమోదించుకోకుండా తాత్సారం చేస్తోందని
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఉప ఎన్నికలు
వస్తే బిజెపి, వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చేవి తేలిపోయేదన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపికి ఒక్క ఎంపీ, ఒక్క అసెంబ్లీ
సీటు మాత్రమే దక్కిందన్నారు. 2019లో కేంద్రంలో బిజెపి
అధికారంలోకి రాదన్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా ఉండే
అవకాశం ఉందన్నారు.

కర్నూల్ జిల్లా జొన్నగిరిలో నవ నిర్మాణ దీక్షలో ఏపీ సీఎం
చంద్రబాబునాయుడు ఆదివారం నాడు పాల్గొన్నారు.


బిజెపి, వైసీపీలు కుట్రలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
కుట్ర రాజకీయాలను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం
ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు. మహకుట్ర చేసి
రాష్ట్రాన్ని అస్థిరపర్చే కుట్రను చేస్తున్నారని బాబు
ఆరోపించారు. అందరినీ రెచ్చగొడుతున్నారు.  రాష్ట్రంలో
అస్థిరతను చేయాలని కుట్ర చేస్తున్నారు.


వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఎందుకు  
ఆమోదించుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలు
ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజీనామాలను
ఆమోదించుకోకుండా తాత్సారం చేస్తున్నారని వైసీపీపై
విమర్శలు గుప్పించారు. ఏడాది సమయం ఉంటే ఎన్నికలు
రావనే ఉద్దేశ్యంతో వైసీపీ రాజీనామాల డ్రామాలు
ఆడుతోందన్నారు. ఉప ఎన్నికలొస్తే బిజెపి, వైసీపీని చిత్తు
చిత్తుగా ఓడించి తగిన బుద్ది చెప్పేవాళ్ళమని బాబు
చెప్పారు. 

రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ధర్మ పోరాట  దీక్ష,
నవనిర్మాణ దీక్షలు చేస్తోంటే తనకు వ్యతిరేకంగా  వైసీపీ
నయవంచన దీక్ష చేస్తోందని బాబు మండిపడ్డారు. రాష్ట్రానికి
అన్యాయం చేసేందుకు వైసీపీ బిజెపితో కుమ్మక్కైందన్నారు. 

ఇసుక మాఫియాకు తాను సహకరిస్తున్నానని పవన్ కళ్యాణ్
చేసిన విమర్శలను బాబు తోసిపుచ్చారు. ఇసుకను
ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు. తప్పు చేసిన వారిని
నిలదీయాలని సూచించారు. వారికి తాను కూడ
సహకరిస్తానన్నారు.

పోలవరానికి అడ్డుపడితే ప్రజలు క్షమించరు

ఏపీకి వరప్రదాయిని లాంటి పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడితే
ఏపీ ప్రజలు క్షమించరని చంద్రబాబునాయుడు చెప్పారు.
2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు
ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం నుండి నిధులు
రావడం లేదన్నారు. అయితే ప్రాజెక్టును అడ్డుకొనేందుకు
కొందరు కుట్రలు పన్నుతున్నారని బాబు విమర్శించారు.
ఎవరు అడ్డుపడినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను
ఆపబోమన్నారు. 

ప్రాధాన్యత క్రమంలోనే  సాగునీటి ప్రాజెక్టులను పూర్తి
చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  
రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా కాంగ్రెస్ పార్టీ  
విభజించిందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే
ఉద్దేశ్యంతో  ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు
పెట్టుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు.

కానీ, ఏపీ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందన్నారు.
అయితే ఈ రెండు జాతీయ పార్టీలు ఏపీ రాష్ట్రానికి
అన్యాయం చేశాయని బాబు విమర్శించారు. అయితే ఏపీకి
జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నవనిర్మాణ దీక్షలు
చేపడుతున్నట్టు  బాబు గుర్తు చేశారు. రాష్ట్రానికి న్యాయం
జరిగేందుకు గాను పౌరుషంతో పనిచేయాల్సిన అవసరం
ఉందని బాబు చెప్పారు.

ఓర్వకల్లులో వెయ్యి మెగావాట్లు సోలార్ ఎనర్జీ పార్క్ ను  
ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.  ప్రపంచంలోనే
అతిపెద్ద సోలార్ పార్క్ ఓర్వకల్లు రికార్డు
సృష్టించనుందన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి  
కర్నూల్ జిల్లాలోని చెరువులను నింపనున్నట్టు
చంద్రబాబునాయుడు చెప్పారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని
ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీలో విద్యుత్ ఛార్జీలు
పెంచబోమని చెప్పిన ఏకైక రాష్ట్రం ఏపీ రాష్ట్రమని
చంద్రబాబునాయుడు చెప్పారు. 

త్వరలోనే ఏపీలోని సుమారు 200కుపైగా పట్టణాల్లో  అన్న
క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా ప్రతి
నిరుద్యోగికి వెయ్యి రూపాయాల నిరుద్యోగ భృతిని కూడ
ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. ఏ ధనిక రాష్ట్రమైనా
నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తోందా అని బాబు
ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios