జగన్ మూడు జన్మలెత్తినా... మూడు రాజధానులు అసాధ్యం: నారా లోకేష్
ఏపీ రాజధానిగా కేవలం అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపడుతున్న పోరాటం 700రోజులకు చేరింది. ఈ సందర్భంగా మరోసారి అమరావతి ఉద్యమానికి, రైతుల పాదయాత్రకు లోకేష్ మద్దతు ప్రకటించారు.
అమరావతి: వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రజలు చేపట్టిన ఉద్యమం 700 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మద్దతు తెలిపారు. ప్రజారాజధానిపై ప్రభుత్వాధినేతగా వైఎస్ జగన్‌రెడ్డి విద్వేషపు కుట్రలపై అమరావతి రైతులు, కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం 700 రోజులకి చేరిందని లోకేష్ పేర్కొన్నారు.
''30 వేల మంది రైతుల సమస్యపై చిన్నచూపు చూసిన పాలకుల కళ్లు బైర్లుకమ్మేలా కోట్లాది రాష్ట్రప్రజలు వారికి మద్దతుగా నిలిచారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర జనసంద్రాన్ని తలపిస్తోంది'' అని nara lokesh అన్నారు.
''ys jagan reddy ఆయన మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడురాజధానులు కట్టలేరు. ప్రజా రాజధాని కోసం భూములనే కాదు ప్రాణాలను సైతం తృణప్రాయంగా చేసిన రైతుల త్యాగం నిరుపయోగం కాదు. అమరావతి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. అమరావతి వైపు న్యాయం ఉంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు ఉంది. ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటాయి'' అని నారా లోకేష్ పేర్కొన్నారు.
Somu Veerraju: రైతుల పాదయాత్రకు మద్దతు.. రాజధానిపై బీజేపీ వైఖరి స్పష్టం చేసిన సోము వీర్రాజు
ఇలా మూడు రాజధానులు అసాధ్యమన్న నారా లోకేష్ కు ఘాటుగా కౌంటరిచ్చారు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలడా... అంటూ బొత్స ఎద్దేవా చేసారు. అసలు లోకేష్ బుర్ర వుండే మాట్లాడుతున్నాడా అని botsa satyanarayana మండిపడ్డారు.
ఇప్పటికే ప్రకటించినట్లుగానే ముమ్మాటికీ three capitals నిర్ణయాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేసారు. ఎవ్వరూ మూడు రాజధానులను ఆపలేరని... అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గబోదన్నారు. సాంకేతిక సమస్యలన్నింటిని పరిష్కరించి మూడు రాజధానుల నుండి పాలన సాగిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం పాదయాత్రపై బొత్స సంచలన కామెంట్స్ చేసారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఈ పాదయాత్ర జరుగుతోందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
ఇక ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్రలో కొందరు మహిళ మోడ్రన్ గా కనిపించడంపై సోషల్ మీడియాలో ఓ వర్గం విమర్శలు మొదలుపెట్టారు. పాదయాత్ర రైతులు కాకుండా ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారంటూ మోడ్రన్ మహిళలు పాదయాత్ర చేస్తున్నట్లుగా వున్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స కూడా పాదయాత్రను పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారంటూ సోషల్ మీడియా ట్రోల్స్ కు బలం చేకూర్చారు.
సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారని... అలాంటప్పుడు అమరావతి రైతుల రాజధాని కాదు ఏపీ ప్రజలందరి రాజధాని అని హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.