పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం: ఏపీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి వేణు
ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వివరించారు. పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి చెప్పారు.
అమరావతి:పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వివరించారు. ఏపీ సచివాలయంలో బుధవారంనాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి చెప్పారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదించిందన్నారు.బధిర టెన్నిస్ ప్లేయర్ జఫ్రీన్ కు ఇళ్ల స్థలం మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి చెప్పారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు పీవోటి చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకు కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అన్ని చోట్ల అభివృద్ధి చెందుతుందన్నారు.ప్రైవేట్ యూనివర్శిటీల చట్టంలో సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.ప్రముఖ యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.కురుపాం ఇంజనీరింగ్ కాలేజీలో గిరిజనుకు 50 శాతం సీట్లు కేటాయించడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని ఏపీ మంత్రి వివరించారు.
also read:చంద్రబాబు స్కాంలపై అసెంబ్లీలో చర్చిద్దాం: కేబినెట్ లో మంత్రులతో జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో చదువుకున్న ప్రతి విద్యార్ధి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగి రిటైరైన ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు.