చంద్రబాబు స్కాంలపై అసెంబ్లీలో చర్చిద్దాం: కేబినెట్ లో మంత్రులతో జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుండి పాలన, చంద్రబాబు స్కాం ల గురించి జగన్ ప్రస్తావించారు.
అమరావతి: చంద్రబాబునాయుడు చేసిన స్కామ్ లపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులకు చెప్పారు.కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం బుధవారంనాడు ఏపీ సచివాలయంలో జరిగింది. కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసి అధికారులు వెళ్లిపోయాక మంత్రులతో రాజకీయ అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు.ఈ నెల 9వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసు విషయమై మంత్రులతో చర్చించారు జగన్. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో చేసిన అవినీతిపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సీఎం జగన్ మంత్రులకు చెప్పారని సమాచారం.
మరో వైపు దసరా నుండి విశాఖపట్టణం నుండి పాలన సాగించనున్నట్టుగా జగన్ తేల్చి చెప్పారు. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దసరా నుండి విశాఖ నుండి పాలన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని జగన్ కేబినెట్ లో మంత్రులకు చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతి రాజధానికి గతంలో వైఎస్ఆర్‌సీపీ మద్దతిచ్చిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
మరో వైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు.వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.నిర్ణీత గడువు కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ఏపీ కూడ అందుకు సిద్దపడాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సన్నద్దతతో ఉండాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు.అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు.ప్రతి అంశంపై కూలకంశంగా అధ్యయనం చేయాలని సీఎం మంత్రులను కోరారు.
విశాఖపట్టణం నుండే పరిపాలనను సాగిస్తానని వైఎస్ జగన్ గతంలోనే ప్రకటించారు. తొలుత సీఎంఓను తరలించనున్నారు. సీఎంఓ కు అవసరమైన కార్యాలయాల కోసం భవనాలను కూడ అధికారులు సిద్దం చేస్తున్నారు.