విజయవాడ: పక్క జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు మాచర్లలో ఏం పని అనే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల ప్రశ్నపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. మాచర్ల ఎవరూ వెళ్లకూడదా, అదేమైనా పాకిస్తానా, మాచర్ల వెళ్లాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలా, అక్కడ రౌడీలుంటే తాము వెళ్లకూడదా, అలాంటప్పుడు జగన్ పులివెందులలోని ఉండాలి కదా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. 

జగన్ మాత్రం ఊరంతా తిరగవచ్చు గానీ తాము తిరగకూడదా అని ఆయన అడిగారు. ఎవరిని బెదిరిస్తు్నారు మీరు, ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అని అయన అడిగారు. ఇటువంటి రౌడీలను చాలా మందిని చూశానని ఆయన అన్నారు. మాచర్ల ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

Also Read: ప్రజలే వైసిపి నాయకుల్ని పిచ్చికుక్కల్లా కొడతారు...ఆరోజు దగ్గర్లోనే: చంద్రబాబు

పక్క జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఎందుకు మాచర్ల వెళ్లారంటూ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న పక్క జిల్లాకు ఎందుకు వెళ్లారంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు. మాచర్లలో ఆ ఇద్దరు నేతలపై దాడి జరిగిన నేపథ్యంలో వారు ఆ ప్రశ్న వేశారు. దానిపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.

మాచర్ల దాడిలో గాయపడిన న్యాయవాది కిశోర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. చంద్రబాబుతో పాటు హైకోర్టు న్యాయవాదులు కూడా కిశోర్ ను పరామర్శించారు.

Also Read: 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు... ఎందుకు భయం : జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

ఏదో ఒక కారణంతో తమ అభ్యర్థుల నామినే,న్లను తిరస్కరిస్తున్నారని, ధైర్యం ఉంటే నామినేషన్లు వేసి గెలవాలని, ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తామని ఆయన అన్నారు. బెదిరించి, భయబ్రాంతులకు గురి చేస్తే కుదరదని ఆయన అన్నారు. మీ ఆటలు సాగనివ్వమని, ప్రజాస్వామ్యమంటే తమాషా అనుకోవద్దని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో అడుగడుగునా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగుతోందని, నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటికే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు .ఆయా ప్రాంతాల్లో రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.