ఏ రాష్ట్రంలోనైనా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత వైరం ఉంటుంది. ఈ వైరం ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల మధ్య కాస్త ఎక్కువగానే ఉంది. ఇరు పార్టీల అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల దాకా.. ప్రతి విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు.

అలాంటి పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు టీడీపీ నాయకులు సహకరిస్తుండటం గమనార్హం.

అసలేంజరిగిందంటే.. వైసీపీ ప్రలోభాలకు తలొగ్గారో.. మరెంటో గానీ, పలుచోట్ల అధికార పార్టీ వైసీపీతో పలువురు టీడీపీ నేతలు జట్టుకట్టారు. ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో వైసీపీ-టీడీపీ ములాఖత్ అయ్యాయి. ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. 

Also Read టీడీపీ నేతల కారుపై దాడి... నిందితుడికి బెయిల్, వార్డ్ సభ్యుడిగా నామినేషన్..

ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వైసీపీతో ములాఖత్ అవటాన్ని ముట్లూరు టీడీపీలోని ఓవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జరుగుతున్న పరిణామాలను ఎంపీ జయదేవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీని వైసీపీకి అమ్ముకుంటున్నారని మాజీ ఎంపీపీ పూనాటి రమేష్‌పై ఎంపీకి ఫిర్యాదు చేశారు. పరిస్థితులను చక్కదిద్దాలంటూ విజ్ఞప్తి చేశారు. మరి ఎంపీ జయదేవ్ కల్పించుకుని పరిస్థితులను చక్కదిద్దుతారేమో చూడాలి.

అయితే.. రెండు రోజుల క్రితమే.. ఓ వైసీపీ నేత టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా వాహనాలపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ వైసీపీ నేత దాడిలో టీడీపీ నేతల కారు పూర్తిగా ధ్వంసమైంది. మాచర్లలో జరిగిన ఈ ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నాయకులు వాగ్వాదాలు కూడా చేసుకున్నారు. మరి ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.