భారతీయ జనతా పార్టీ దేవాలయాలను నిర్మాణం చేసే పార్టీ అన్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీరాముడి గుడిని భారతదేశంలో కడుతున్న పార్టీ అని అన్నారు.

అలాంటి తమ పార్టీని ఆలయాలను కూల్చే పార్టీగా డీజీపీ చెప్పారని.. ఈ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు 20వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో మరో ఉద్యమాన్ని చేపడతామని వీర్రాజు హెచ్చరించారు. 

కాగా, ఆలయాలపై జరిగిన దాడుల వెనుక టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడంతో తీవ్రదుమారం రేగింది. గౌతమ్ సవాంగ్ పొలిటీషన్ మాదిరిగా మాట్లాడుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:ఆలయాలపై దాడులు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: జీవీఎల్

తాజాగా డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సోము వీర్రాజు లేఖ రాశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసులో తమ పార్టీ బీజేపీ కార్యకర్తల హస్తమన్నట్లు ప్రకటించారని.. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని డీజీపీని కోరారు.

సవాంగ్ ప్రకటన వల్ల మీడియాలో బీజేపీ కార్యకర్తలే దాడులు చేసినట్లు వార్తలు ప్రచురితమవుతున్నాయని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ వివాదంతో బీజేపీ కార్యకర్తలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

అలాగే విగ్రహాలపై దాడులు చేయడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి చాలా తేడా ఉందని.. దేవాలయాలపై దాడులను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వీర్రాజు విమర్శించారు.