దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోయిందని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని రాజకీయ అంశంపై చూపి పార్టీలపై నెడుతున్నారని ఆయన ఆరోపించారు.

దోషులను పట్టుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని నరసింహారావు మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టులు చూసి కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే బీజేపీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుందని జీవీఎల్ వెల్లడించారు.

ఏపీ ఘటనలపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఖచ్చితమైన నివేదిక కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని నరసింహారావు తెలిపారు. 

అంతకుముందు దేవాలయాలపై దాడుల వెనుక ఎవరున్నారో డీజీపీ బయటపెట్టడంతో బీజేపీ నేతలకు వణుకు పుట్టిందని  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి నేతలకు భయపడేది లేదన్నారు.తాము తప్పులు చేసినట్టుగా ఆధారాలుంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. 

డీజీపీని బెదిరించే  విధంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశాడన్నారు.  దేవాలయాల్లో దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల్లో వాస్తవాలు బయటపెట్టిన డీజీపీని టీడీపీ, బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.