వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అసలు  కేంద్రం నుంచి నిధులు రాకుంటే.. జగన్ అమలు చేస్తోన్న నవరత్నాలకు డబ్బులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.  

ప్రెస్‌మీట్లు కాదు డైరెక్ట్ డిబేట్‌కు తాము సిద్ధమంటూ ఏపీ మంత్రులకు సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి రాబోయే రోజుల్లో తాము ఆందోళన ఉద్ధృతం చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. 2014-15లో ఏపీ విభజన తర్వాత కేంద్ర పన్నుల కింద రూ.24,500 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2020-21 నాటికి రూ.72,000 కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు వెల్లడించారు. తాము ఇన్ని నిధలు ఇవ్వబట్టే.. నవరత్నాల కింద సంక్షేమ కార్యక్రమాలకు వాడుతున్నారంటూ ఆయన ఫైరయ్యారు. 

కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. కడపలో తాము నిర్వహించిన సభకు భారీ స్పందన రావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలపై అభిమానంతో ఏపీ రహదారుల కోసం రూ.65000 కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్రం నిధులు వాడుకుంటూనే తిట్టడం సబబు కాదన్నారు. జగన్ పాలనలో వేసిన రోడ్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఇళ్లు ఇచ్చామని.. ఇందుకోసం రూ.32 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. 

ఇకోతే.. శనివారం కడపలో (kadapa) బీజేపీ నిర్వహించిన రాయలసీమ రణభేరి (rayalaseema ranabheri) సభలో కేంద్ర మంత్రికిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ (ysrcp) పాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. రతనాల సీమ వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ సీమలో అభివృద్ధి మాత్రం జరగలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజక్టులపై నిర్లక్ష్యమే ఈ ప్రాంతం వెనుబాటుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అనేక సంస్థలు నిర్మించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కడప, తిరుపతి, అనంతపురంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయని.. పోలవరం ప్రాజెక్టును (polavaram project) పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్‌ చేపట్టిన కార్యక్రమాలేంటి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీమ అభివృద్ధికి మొట్టమొదట పోరాడింది బీజేపీయేనని... ఇందుకోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

ప్రధాని మోదీ (narendra modi) హయాంలో రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. కేంద్రం అన్ని రకాలుగా అండగా నిలస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ పాలన చూస్తే రానున్న రోజుల్లో ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అప్పులు ఇచ్చే వాళ్లు ఎంతకాలం ఇస్తారు? అప్పులపై ఆధారపడి ఎంతకాలం పాలిస్తారు? ప్రతి రైతుకు కేంద్రం ఏటా రూ.6వేలు ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.