విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. విశాఖ ఉక్కుకు సంబంధించి హైకమాండ్ స్టాండ్‌నే రాష్ట్ర శాఖ అనుసరిస్తుందని.. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు వుండవన్నారు కన్నా.

అయితే అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. కాగా, స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతుండటంతో శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దీనిని  ఆయుధంగా చేసుకుని వైసీపీ, టీడీపీలు కాషాయ నేతలపై మాటల దాడి చేస్తున్నారు. 

స్టీల్ ప్లాంట్ అంశంలో లబ్ధి పొందాలని.. వైసీపీ, టీడీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని భావిస్తున్న ఏపీ బీజేపీ పెద్దలకు సంకటం ఎదురైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావడంతో ఏం చేయాలో తోచని సందిగ్ద పరిస్థితి ఎదుర్కొన్నారు.

అందుకే ఆ మధ్యన ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.  సమావేశం తరువాత భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరించారు.  

స్టీల్ ప్లాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించామని చెప్పారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే, వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.