వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. చర్చి మీద రాళ్లు పడితే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని.. ఆలయాలపై రాళ్లు వేస్తే పిచ్చివాళ్ల చర్య అంటోందని వీర్రాజు విమర్శించారు.

మరి చర్చి మీద రాళ్లు వేసింది పిచ్చోళ్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. గుడులు మీద వేస్తేనే పిచ్చివాళ్లు వేసినట్లా అని వీర్రాజు  నిలదీశారు. చర్చి మీద రాయి వేస్తే అంత ఫైరయిన ప్రభుత్వం.. అంత రథం దగ్థమయితే ఎందుకు సీరియస్ కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

కాగా, రేపు చలో అమలాపురానికి బయల్దేరిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో పోలీసులు నిర్బంధించారు.  ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read:రేపు చలో అమలాపురానికి పిలుపు: బెజవాడలో సోము వీర్రాజు నిర్బంధం

అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంతర్వేది పర్యటనకు బయల్దేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వీర్రాజు మండిపడ్డారు.

దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని చెప్పారు.