రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆదివారం సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ఆయన.. లాక్‌డౌన్‌ను సడలించడం లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఓవైపు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కన్నా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ముందుగానే మేల్కొని లాక్‌డౌన్ విధించడం పట్ల పలు దేశాలు, ప్రపంచ ఆరోగ్య  సంస్థ భారతదేశాన్ని అభినందించాయని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.

Also Read:కరోనా నిబంధనలు మరింత కఠినం...విజయవాడలో యాచకులపై నిషేధం

రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు, ఆర్ధిక వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలు అన్నింటికంటే ముఖ్యమని కన్నా లేఖలో ప్రస్తావించారు.

ఒడిశా లాంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్ పరిస్ధితిని యధాతథంగా ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని, ఎలాంటి సడలింపులు వద్దని లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు.

Also Read:కరోనా పై అన్ని తానై: ఈ లవ్ అగర్వాల్ మన తెలుగు ఆఫీసరే!

కాగా లాక్‌డౌన్ అమలు, కరోనా కట్టడి తదితర అంశాలపై శనివారం ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్‌లకే పరిమితం చేయాలని ప్రధానికి తెలియజేశారు. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వారైతులు పూర్తిగా దెబ్బతిన్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.