కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న క్రమంలో ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఈ సమయంలో ఏ విషయాన్నీ నమ్మాలో నమ్మొద్ధో తెలియని అయోమయంలో అందరం కూరుకుపోయి ఉంటాము. ప్రభుత్వ డేటా మాత్రమే సరైనది కాబట్టి దాని కోసం అందరం ఎదురు చూస్తాము. 

ఇలా ప్రతి రోజు సాయంత్రం భారత ప్రభుత్వ అధికారిక గణాంకాలతో సరిగ్గా నాలుగింటికి ప్రత్యక్షమయ్యే లవ్ అగర్వాల్ గురించి వేరుగా ఎవ్వరికి చెప్పనవసరం లేదు. ఇప్పుడు లవ్ అగర్వాల్ అనేది ఒక సాధారణమైన పరిచయం అక్కర్లేని పేరు. 

మీడియా ముందు చాలా కాన్ఫిడెంట్ గా ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వ అన్ని చర్యలను కూడా డిఫెండ్ చేస్తూ, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుంటాడు. 

ఈ 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్  సహరాన్పూర్ జిల్లాకు చెందిన లవ్ అగర్వాల్ ఐఐటీ ఢిల్లీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. 

మామూలుగా అందరూ ఐఏఎస్ అధికారుల్లాగా ముభావంగా చాలా తక్కువ మాట్లాడే టైపు కాదు. ప్రతిదానికి సృజనాత్మకతను జోడించి ముందుకు దూసుకెళ్లే టైపు ఈ 48 ఏండ్ల అధికారి. 

ఐఏఎస్‌ అధికారిగా సెలెక్ట్ అయి ముస్సోరిలో శిక్షణ పూర్తి కాగానే 1997లో కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగును పొందారు. ఆ తరువాత అక్కడి నుండి భద్రాచలం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.  

జూన్‌ 2000 సంవత్సరం నుంచి మెదక్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ గా, ఆ తరువాత అదే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సేవలందించారు. ఆ తరువాత 2003 జూన్ నెల నుంచి నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, ఆ తరువాత జాయింట్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్ గా పని చేశారు. 

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2004–2005 మధ్య కాలంలో సీఎంఓలో సెక్రెటరీగా పనిచేసారు. అక్కడ ఆయన సమర్థతను చూసి 2005 నుంచి 2007 వరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఒక బృహత్కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పంపించారు. 

ఆపరేషన్‌ కొల్లేరును విజయవంతంగా చేపట్టి, కొల్లేరును పరిరక్షించడంతోపాటుగా, అక్కడి పేదల జీవనాన్ని, ఆ కొల్లేరును నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల జీవనాధారాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టి సఫలీకృతులయ్యారు. ఆ  విశాఖ జిల్లా కలెక్టర్‌గా పని చేసారు. 

అలా కెరీర్ లో అంతకంతకు ఎదుగుతూ ప్రస్తుతం ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో శాఖలో పని చేస్తున్నారు. చాలా సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడే ఈ అధికారి అంతే చాకచక్యంతో వ్యవహరిస్తూ ఈ కరోనా వేళ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. 

ఆఫీసులో అత్యంత లేట్ గా ఇంటికెళ్లి, ఉదయం అందరికంటే ముందు వచ్చే వ్యక్తి ఆ కార్యాలయంలో ఈయనే అంటే అతుశయోక్తి కాదు. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న దగ్గరి నుంచి కార్యాలయంలోనే రోజులో దాదాపుగా 15 నుంచి 16 గంటలు కార్యాలయంలోనే గడుపుతున్నారని అంటున్నారు.