సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఉదయనిధి మాట్లాడుతున్నప్పుడు అదే వేదికపై వున్న పీకే శేఖర్ బాబు అభ్యంతరం తెలపకపోవడం దేనికి సంకేతమని పురందేశ్వరి ప్రశ్నించారు.

సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై సాంప్రదాయవాదులు, పలు పార్టీల నేతలు భగ్గుమన్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం ఉదయనిధిపై వ్యాఖ్యలను తప్పుబట్టారు. సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష ‘‘ఇండియా’’ కూటమిలోని నేతలు మాట్లాడుతున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఉదయనిధికి మద్ధతుగా కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. 

ఉదయనిధి మాట్లాడుతున్నప్పుడు అదే వేదికపై వున్న పీకే శేఖర్ బాబు అభ్యంతరం తెలపకపోవడం దేనికి సంకేతమని పురందేశ్వరి ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్న చేయడమే ఇండియా కూటమి ఉద్దేశమని కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారని.. ఈ ఘటనలు దేశంలో హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పురందేశ్వరి ట్వీట్ చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు లేదని.. గతంలో రాహుల్ గాంధీ హిందూ సంస్థలను లష్కరే తొయిబా సంస్థతో పోల్చిన విషయాన్ని పురందేశ్వరి గుర్తుచేశారు. 

ALso Read: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన వీసీకే చీఫ్.. ‘అంబేద్కర్, పెరియార్ ఐడియాలజీ’

కాగా.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అంటువ్యాధి వంటిదని, డెంగ్యూ, ఫ్లూ వంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి ఓ రచయితల సమావేశంలో అన్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. తాను హిందువుల మరణాన్ని కోరలేదని, కేవలం భావజాలం గురించే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. దేశమంతటా దీనిపై చర్చ జరుగుతుండగా.. విడుదలై చిరుతైగల్ కాచ్చి చీఫ్ తొల్ తిరుమావలవన్ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వెంట నిలబడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇచ్చారు.