వైసీపీపై బీజేపీ ప్రశ్నల వర్షం.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్
ఏపీ అధికార పార్టీ వైసీపీని బీజేపీ విమర్శించింది. నాలుగేళ్ల పాలనపై తొమ్మిది ప్రశ్నల బాణం విడిచింది. పార్టీ ప్రధానకార్యాలయంలో బీజేపీ నేత విష్ణువర్దన్ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నలను ఏకరువు పెట్టారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీపై బీజేపీ ప్రశ్నల వర్షం కురిసింది. జగన్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ 9 ప్రశ్నలు వేసింది. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై మొత్తం 9 ప్రశ్నలు ఏకరువు పెట్టారు. వీటికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకానీ, తమ అధ్యక్షులు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఫైర్ అయ్యారు. తమ అధ్యక్షులు పురంధేశ్వరిని విమర్శించేముందు ఆ మంత్రులు ఏం పనులు చేశారో? చర్చించడం మంచిదని వివరించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
- రాష్ట్రంలో బాలల అక్రమ రవాణాకు అడ్డకట్ట వేయడంలో వైఫల్యానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
- దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడిపోయిందని అడిగారు.
- ప్రజలకు మంచి నీటిని ఎందుకు అందించలేకపోయారని, ఇందుకోసం కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదని ప్రశ్నించారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేస్తున్నదని వివరించారు.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా పేదలకు కేంద్రప్రభుత్వం కేటాయించిన సుమారు 25 లక్షల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిర్మించి ఇవ్వలేదని ప్రశ్నించారు.
- రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్య సదుపాయాలు అందించే విషయంలో ఎందుకు ఫెయిల్ అయిందని అడిగారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాల్లో లోటు ఎందుకు ఉన్నది? ఖాళీలను సిబ్బందితో ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
- ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించని హాస్పిటళ్లకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? 80 శాతం కార్పొరేట్ హాస్పిటళ్లు ఎందుకు ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయడం లేదు? అని నిలదీశారు.
- ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పీజీ స్టూడెంట్లకు స్కాలర్షిప్‌లు ఎందుకు ఎత్తేశారని అడిగారు. డిగ్రీలో తెలుగును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
- ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎందుకు నియామకాలు చేపట్టడం లేదు? 2.50 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
- దెబ్బతిన్న రహదారులను ఎందుకు పునర్నిర్మించడం లేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అడిగారు.