వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధించిన ఒక్క డైలాగ్ రాష్ట్ర రాజకీయాలను అల్లకల్లోలం చేసేస్తోందా? ఎన్డీఏలో నుండి తనంతట తానుగా చంద్రబాబునాయుడు బయటకు వెళిపోయే పరిస్ధితులు సృష్టిస్తోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అవే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ జగన్ అన్నదేంటి? ‘ప్రత్యేకహోదాపై హామీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుకు సిద్దం’ అని ఓ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. ఆ డైలాగే రాష్ట్ర రాజకీయాల్లో అల్లకల్లోలం రేపుతోంది. తాజాగా చంద్రబాబు మాటలు అదే విషయాన్ని రుజువుచేస్తున్నాయ్.

చాలా రోజుల నుండి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని భాజపా ఎంఎల్సీ సోము వీర్రాజు విరుచుకుపడుతున్నారు. వీర్రాజుకు సమాధానాలు చెప్పలేకే టిడిపి నేతలు కిందా మీదవుతున్నారు. ఇంతలో ఏమైందో ఏమో భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు హటాత్తుగా తెరపైకి వచ్చారు. ఆయన ఏకంగా ఫిరాయింపులపై వేటు వేయాలంటూ చంద్రబాబునే డిమాండ్ చేయటంతో టిడిపిలో పెద్ద కలకలమే రేగింది.

దావోస్ నుండి తిరిగి రాగానే ఇక్కడి విషయాలు తెలుసుకున్న  చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. అసలే వివిధ కారణాలతో కేంద్రంపై మంటమీదున్న చంద్రబాబు శనివారం ఒక్కసారిగా బరెస్టయ్యారు. భాజపాతో పొత్తుల గురించి నిష్టూరంగా మాట్లాడారు. తమతో పొత్తు వద్దనుకుంటే ఆ విషయాన్నే స్పష్టంగా చెబితే తమదారేదో తాము చూసుకుంటామన్నారు.  పొత్తులు, మిత్రధర్మం లాంటి చాలా నీతులే మాట్లాడారు. దాంతో భాజపాపై చంద్రబాబులో పేరుకుపోయిన అసంతృప్తి బయటపడింది.

భాజపాపై అలా మాట్లాడారో లేదో వెంటనే మరో నేత, స్వయానా వదిన అయిన దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబుపై ఫుల్లుగా ఫైరైపోయారు. మిత్రధర్మాన్ని అతిక్రమిస్తున్నది, పొత్తులపై పదే పదే మాట్లాడుతున్నది చంద్రబాబే అంటూ మండిపడ్డారు. ఫిరాయింపులపై మాట్లాడుతూ, తన తండ్రి ఎన్టీఆర్ హయాంలో ఇతర పార్టీల నుండి ఎవరైనా టిడిపిలో చేరాలనుకుంటే ముందు తమ పదవులకు రాజీనామాలు చేయాలన్న నిబంధన ఉండేదని గుర్తుచేశారు. భాజపా నేతల వరస చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతున్నట్లే ఉంది. సో, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు ఎక్కువ రోజులు ఎన్డీఏలో కొనసాగరేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.