లాఠీ పట్టుకుని గుంటూరు రోడ్లపై తిరుగుతూ... వైసిపి మేయర్ మనోహర్ హల్ చల్ (వీడియో)
టిడిపి పిలుపుమేరకు బంద్ పాటిస్తున్న వ్యాపారులపై గుంటూరు మేయర్ జులుం ప్రదర్శించారని... లాఠీ పట్టుకుని తమను బెదిరించారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

అమరావతి : ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి ఇవాళ ఏపీ బంద్ చేపట్టింది. ఈ క్రమంలో టిడిపి నాయకులు విద్యాలయాలు, షాపులను మూసివేయించారు. కొందరు వ్యాపారులు బంద్ పాటిస్తూ స్వచ్చందంగానే దుకాణాలు మూసేసారు. అయితే టిడిపి బంద్ ను పాటించవద్దంటూ వైసిపి ఎమ్మెల్యే, మేయర్ లాఠీలు చేతబట్టి తిరుగుతూ షాప్ లు తెలిపించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు పాల్పడినట్లు ఆరోపిస్తూ మజీ సీఎం చంద్రబాబును సిఐడి పోలీసులు మొన్న(శనివారం) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఆదివారం విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబును హాజరుపర్చగా సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత తీర్పు వెలువడింది. చంద్రబాబుకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. అయితే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించి సీఎం జగన్ జైల్లో పెట్టించారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. తమ అధినేతను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నేడు ఏపీ బంద్ చేపట్టారు.
వీడియో
ఇలా గుంటూరు పట్టణంలో కూడా టిడిపి బంద్ పాటించారు. బంద్ నేపథ్యంలో వ్యాపారులు షాపులను మూసివేయగా నగర మేయర్ కావటి మనోహర్ తన అనుచరులతో కలిసి శంకర్ విలాస్ వద్ద హల్ చల్ చేసారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ వద్ద లాఠీ తీసుకుని షాప్ ల వద్దకు వెళ్లిన మేయర్ బంద్ పాటించవద్దని... షాపులు తెరవాలనని సూచించాడు. ఈ విషయం తెలిసి టిడిపితో పాటు జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను అక్కడినుండి పంపించారు.
Read More ఏపీ బంద్... టిడిపి శ్రేణుల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత
అయితే పోలీసుల ప్రోద్భలంతోనే 144 సెక్షన్ అమల్లో వున్నా మేయర్ మనోహర్ వ్యాపారులపై దౌర్జన్యానికి దిగాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అరండల్ పేట పోలీస్ స్టేషన్ ముందే మేయర్ వీరంగం సృష్టించినా పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారని అంటున్నారు. పోలీసులు కూడా వైసిపి కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిస్థితిని సమీక్షించారు.