అమరావతి: అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను చంద్రబాబు విమర్శించడం బాధాకరమన్నారు. 

తన కుమారుడు ఫారిన్ వెళ్లి చదువుకున్నారని చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని రోజా గుర్తు చేశారు. అయితే విదేశాల్లో చదివిన లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ దేశమా లేక రాష్ట్రమా అన్నది తెలియదని విమర్శించారు. ఒక కాన్ఫరెన్స్ లో నారా లోకేష్ అన్న వీడియోలు సైతం చూడొచ్చని రోజా సెటైర్లు వేశారు. 

వర్థంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అని ఆయన గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. తాను నిలుచున్న మంగళగిరి నియోజకవర్గాన్ని మంగళగిరి అని పలకకుండా మందళగిరి అని పిలిచే మందబుద్ధి కలిగిన కొడుకుని కన్న చంద్రబాబు తమ ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడం సిగ్గు చేటు అన్నారు. 

అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

సోమవారం మహిళా భద్రతపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయల దండలు వేసుకుని వచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఇక టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అయితే ఆయన సైజుకు తగ్గట్టుగా ఉల్లిపాయ తెచ్చారని అది ఎక్కడ నుంచి కొనుగోలు చేశారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. 

రైతు బజార్ నుంచి కొనుగోలు చేశారా లేక హెరిటేజ్ నుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేశారో అచ్చెన్నాయుడు చెప్తే బాగుంటుందన్నారు. ఉల్లిధరలపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే సోమవారం ఉల్లిపై చర్చకు పట్టుబడిన వారు అసెంబ్లీ బయట తిరుగుతుంటే తాము మాత్రం అసెంబ్లీలో ఉన్నామని రోజా స్పష్టం చేశారు. 

చంద్రబాబుపై రోశయ్య డైలాగ్ వదిలిన బుగ్గన: నాకు తెలివి ఉంటే కత్తి తీసుకుని

టీడీపీ తీరు చూస్తుంటే వారు ఉల్లిపాయల కోసం రాలేదని ఎర్రగడ్డ నుంచి అసెంబ్లీలో లొల్లి చేయడానికి వచ్చారంటూ రోజా ధ్వజమెత్తారు.చంద్రబాబు నాయుడు పాలనలో 90 శాతం మంది రైతులు ఇబ్బందులు పడిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. 

పండించిన పంటకు గిట్టుబాటు దొరక్కనాడు రైతులు ఎదుర్కొన్న పరిస్థితి అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు రోజా. అన్ని రకాలుగా రైతులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈనాడు రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. 

రైతు బాంధవుడుగా పిలుచుకునే దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తండ్రికంటే నాలుగు అడుగులు ముందుకు వేసి మంచి పాలన అందిస్తున్నారని రోజా స్పష్టం చేశారు. 

జగన్! ముందుంది ముసళ్లపండగ, మీ కథ చూస్తాం: చంద్రబాబు ఫైర్...

సుపరిపాలన అందిస్తున్న జగన్ ను అభినందించాల్సింది పోయి ఒక వీధి రౌడీలా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవర్తించడం చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. తన కొడుకుని సొంత నియోజకవర్గంలో గెలిపించుకోలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబునాయుడు అంటూ విరుచుకుపడ్డారు రోజా. 

చంద్రబాబు నాయుడుకు చిన్నమెుదడు చితికిపోయిందని రోజా విమర్శించారు. చంద్రబాబును ఆస్పత్రిలో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వల్ల అసెంబ్లీలో సమయం వృథా తప్ప ఏమీ లేదని రోజా విమర్శించారు. 

సొంత జెండా, సొంత అజెండాతో ప్రజల్లోకి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు రోజా. అలాంటి వైయస్ జగన్ ను చంద్రబాబు నాయుడు విమర్శించినంత మాత్రాన ఒరిగిందేమీ లేదంటూ మండిపడ్డారు రోజా. 

అసెంబ్లీలో గురుశిష్యుల వార్: జగన్ ను చూసి దేవుడు సైతం భయపడుతున్నారన్న బాబు