అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదటి రోజే వేడెక్కాయి. రాష్ట్రంలో పంట నష్టంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులు నిరసనకు దిగారు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. టీడీపీ సభ్యుల నిరసనతో సమావేశాలకు అంతరాయం ఏర్పడింది.

చంద్రబాబు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. రౌడీయిజం చేసింది ఆయనే, అన్యాయం జరుగుతుందని అనేది ఆయనే ఆని సీఎం అన్నారు. ఓ పద్ధతి ఉండాలని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబు అని పార్థసారథి అన్నారు. 

ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ సభ్యులు  స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. పంట నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుడు అడిగిన విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, మళ్లీ అదే మాట్లాడడం సరి కాదని జగన్ అన్నారు. నెల రోజుల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వల్ల పార్లమెంటు సమావేశాలు కూడా జరగలేదని, ముఖ్యమైన అంశాలున్నాయి కాబట్టి సమావేశాలు నిర్వహించాలని అనుకున్నామని, అది తప్పదు కాబట్టి జరుపుతున్నామని ఆయన అన్నారు.  చర్చ జరగకూడదని టీడీపీ సభ్యులు భావిస్తున్నారని ఆయన అన్నారు. 

ప్రతిపక్ష నాయకుడు వచ్చి స్పీకర్ పోడియం వద్ద కూర్చోవడం ఇప్పటి వరకు జరగలేదని జగన్ అన్నారు. తాను వివరణ ఇచ్చానని, నువ్వు కూర్చో నేను మాట్లాడుతానని ప్రతిపక్ష నాయకుడు చేయడం జరగదని ఆయన అన్నారు.  రౌడీయిజం చేసి, కళ్లు పెద్దవి చేసి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. 

టీడీపీ సభ్యులకు సర్దిచెప్పడానికి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రయత్నించారు. మాట్లాడేందుకు సమయం ఇస్తామని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. అయనా టీడీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. తాము ఏం చేశామనే విషయాన్ని ప్రభుత్వం చెప్పిందని ఆయన అన్నారు. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడానికి చంద్రబాబు పోడియంలో బైఠాయించారని మంత్రి కన్నబాబు అన్నారు ఓ ప్రతిపక్ష నేత పోడియంలో బైఠాయించడం ఇదే తొలిసారి అని, ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు.