శాసనమండలి రద్దు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పుడేమీ భూమి బద్ధలై, ఆకాశం విరిగి పడలేదు కదా అని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం నాయకులు అవివేకంగా వ్యవహరిస్తున్నారని... మండలి కేవలం సలహాలిచ్చేందుకేనని తమ్మినేని వ్యాఖ్యానించారు. మండలి రద్దు, సీఆర్‌డీఏ బిల్లులపై తెలుగుదేశం కోర్టుకు వెళితే వెళ్లనివ్వండని స్పీకర్ అన్నారు.

Also Read:మార్చిలో ఏపీ శాసన మండలి రద్దు: జగన్ కు దొరికిన హామీ

ప్రజల విధాన సభ శాసనసభ మాత్రమేనన్న ఆయన శాసనసభలో తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని తమ్మినేని తేల్చి చెప్పారు. శాసనసభలో నిర్ణయాలను వీటో చేసే అధికారం కౌన్సిల్‌కు లేదని, ప్రజల అధికారంతో ఏర్పడిన విధానసభ సృష్టించినదే దిగువసభ అని అన్నారు.

పెద్దల బుద్ధి బాగా పనిచేస్తుందని కౌన్సిల్ ఏర్పాటు చేశారని, ద్రవ్య వినిమయ బిల్లును కూడా నిలిపివేసే స్థితిలో పెద్దల సభ ఉందంటే ఏమనుకోవాలని స్పీకర్ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమానికి నిధులు విడుదల చేయాలంటే బిల్లును అంగీకరించాలి కదా..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషికి తెలియదా..? అని ఎద్దేవా చేశారు.

Also Read:రద్దుకే జగన్ నిర్ణయం: మండలి రద్దు, పునరుద్ధరణ చరిత్ర ఇదీ..

దీనిపై మేధావులు, న్యాయస్థానాలు, విజ్ఞులు ఆలోచించాలని కోరుతున్నానని అన్నారు. దీనిపై ఖచ్చితంగా అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకుంటుందని, శాసనసభకు సర్వాధికారాలున్నాయని తమ్మినేని సీతారామ్ స్పష్టం చేశారు.

శాసనసభలో తీసుకున్న నిర్ణయాలపై సూచనలు చేయాలి కానీ అడ్డుకోవడానికి లేదని అన్నారు. కౌన్సిల్‌లో సభ్యులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.