Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ సభ్యుల ఆందోళన: ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టడంతో గందర గోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  దీంతో సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

AP Assembly Speaker Tammineni Sitaram Adjourns Assembly For 10 minutes
Author
First Published Sep 15, 2022, 10:17 AM IST

అమరావతి: ఏపీ అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యనే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని గతంలో టీడీపీ సభ్యులు కోరిన విషయాన్ని ఏపీ శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల ప్రశ్నలే ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడ మంత్రి గుర్తు చేశారు. సభలోకి ప్ల కార్డులు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు.  సభ సంప్రదాయాలను పాటించాలని కోరారు. సభలో రెడ్ లైన్ దాటిపై చర్యలు తీసుకోవాలని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.  సభా కార్యక్రమాలు సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో ఈ రెడ్ లైన్ గీసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

మరో వైపు టీడీపీ సభ్యులు స్పీకర్ వెల్ లో కి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో ఏపీ మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకున్నారు.  టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఏ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వైద్య శాఖలోని ఖాళీలను తమ ప్రభుత్వం భర్తీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  అదే విధంగా పలువురు సభ్యులు తమ ప్రశ్నలకు సంబంధించి లేవనెత్తిన  అంశాలపై మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు సమాధానం చెప్పారు.  

also read:ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బుగ్గన

అంతకు ముందు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  కూడ టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.  బీఏసీ సమావేశం జరగకముందే  ఆందోళన నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించవద్దని కూడా  ఆయన కోరారు.  సభలో  తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios